ప్రభాస్, గోపీచంద్ మధ్య స్నేహబంధం గురించి ఇండస్ట్రీలోని వారందరికీ బాగా తెలుసు. ఒకరి కోసం ఒకరు అన్నంతగా వారి మధ్య స్నేహం గట్టిపడింది. ఆ ఇద్దరూ ఇప్పటికే ఓ సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్ హీరోగా, గోపీచంద్ విలన్‌గా నటించిన ఆ సినిమా 'వర్షం'. అది బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ ఇద్దర్నీ హీరోలుగా ఒకే సినిమాలో చూడాలని అభిమానులు కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే జరిగింది.
బాలీవుడ్‌లో వచ్చిన క్లాసిక్ యాక్షన్ ఫిల్మ్ 'షోలే'ను తెలుగులో రీమేక్ చేయాలని పూరి జగన్నాథ్ అనుకున్నాడు. అందులో ప్రభాస్, గోపీచంద్‌లను హీరోలుగా తీసుకోవాలని కూడా ఆయన భావించాడు. ఆ మేరకు అప్పట్లో ఇండస్ట్రీలో బాగా ప్రచారం జరిగింది. అయితే అది ఎందుకనో వాస్తవ రూపం దాల్చలేదు. 'షోలే' లాంటి క్లాసిక్ జోలికి వెళ్లడం ఎందుకు అనుకున్నారో, ఏమో! 'షోలే'ను రామ్‌గోపాల్ వర్మ హిందీలోనే 'రామ్‌గోపాల్ వర్మ కీ ఆగ్' పేరుతో తీసి, చేతులు కాల్చుకున్న విషయం మనకు తెలుసు.
బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులను బద్దలుకొట్టి, ఒకే థియేటర్లో అత్యధిక రోజులు ఆడిన సినిమా ('దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' వచ్చేంత వరకు)గా 'షోలే' కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించింది. ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, హేమమాలిని, జయబాధురి, అంజాద్ ఖాన్ లాంటి హేమాహేమీలు నటించిన ఆ సినిమాని రమేశ్ సిప్పీ డైరెక్ట్ చేశారు.